Friday, 6 April 2012

నొప్పి మందులు సొంతంగా వద్దు అవగాహన - Use of Painkillers Awareness

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Use of Painkillers Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నడుంనొప్పి, ఒళ్లునొప్పుల వంటి వాటిని చాలామంది తేలికగా తీసుకుంటారు. డాక్టర్‌ దగ్గరకి వెళ్లకుండానే మందుల దుకాణాల్లో ఏదో ఒక నొప్పి నివారణ మాత్ర కొని తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు అసలు మంచిది కాదు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశమూ ఉందని మీకు తెలుసా? ఈ మాత్రలతో చర్మంపై దద్దుర్ల దగ్గర్నుంచి పేగుల్లో పుండ్లు పడటం వరకు రకరకాల దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. ముఖ్యంగా అల్సర్లు, కాలేయం, గుండె, కిడ్నీ సమస్యలు గలవారికి ఒక్క మాత్రతోనూ తీవ్ర ప్రమాదం ముంచుకురావొచ్చు. ఇలాంటి సమయాల్లో సరైన చికిత్స అందకపోతే ప్రాణాలకూ ముప్పు కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మామూలు నొప్పి నివారణ మందులు (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) వేసుకునేప్పుడు ఛాతీలో మంట రాకుండా ఓమేజ్‌ వంటి ప్రోటాన్‌-పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కానీ దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కొని వేసుకునేవారికి ఈ విషయం తెలియకపోవటం వల్ల చేజేతులా ముప్పును 'కొని' తెచ్చుకుంటున్నారు. నొప్పి మందులను విచక్షణ లేకుండా వాడితే వాటి ప్రభావం అప్పటికప్పుడు మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలం కొనసాగొచ్చు కూడా. ఎందుకంటే అన్నిరకాల నొప్పి మందులతోనూ ఏవో కొన్ని దుష్ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. అందువల్ల డాక్టర్‌ రాసిచ్చిన నొప్పి మందులు వేసుకునేప్పుడూ దుష్ప్రభావాలు కనబడితే జాగ్రత్త పడటం తప్పనిసరి. మళ్లీ ఆసుపత్రికి వెళ్లినపుడు చెబుదాములే అనుకొని సరిపెట్టుకోకుండా వెంటనే ఆ విషయాన్ని డాక్టర్‌కు చెప్పటం ఉత్తమం. నొప్పి అనేది ఏదో ఒక సమస్య మూలంగా బయటకు కనిపించే లక్షణం. కాబట్టి ఆ సమస్యను తగ్గించే చికిత్స అవసరమనే సంగతిని మరవరాదు. అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వేసుకునేవారైతే నొప్పి మందుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆయా మందులతో జరిపే ప్రతిచర్య మూలంగా తీవ్ర ప్రమాదకర ముప్పులు దాడిచేయొచ్చు కూడా. కాబట్టి నొప్పి మందులతో సొంత ప్రయోగాలు కూడదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment