Wednesday, 28 March 2012

అపెండిక్సు వలన లాభాలు , Benifits of Appendix



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Benifits of Appendix-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మన శరీరంలోని ఉండుకం (అపెండిక్స్‌) ఓ వ్యర్థ అవయమని, అవశేషమని చాలామంది భావిస్తుంటారు. చిన్నపేగూ, పెద్దపేగూ కలిసే భాగం మొదట్లో.. వేలు పరిమాణంలో ఉండే దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని అనుకుంటారు. కానీ తీవ్ర ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవటానికి ఇది మనకు తోడ్పడుతుందనే సంగతి మీకు తెలుసా? మనకు మేలు చేసే బ్యాక్టీరియాను నిల్వ చేసుకునే 'సహజ' కేంద్రంగా పనిచేస్తుందంటే నమ్ముతారా? కలరా వంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు పేగుల్లో మనకు మేలు చేసే బ్యాక్టీరియా అంతా తుడిచిపెట్టుకుపోతుంది. దీంతో ఇతరత్రా తీవ్ర ఇన్‌ఫెక్షన్లూ తేలికగా దాడి చేయటానికి అవకాశముంటుంది. ఇలాంటి సమయాల్లో ఉండుకం తనలో దాచుకున్న సహజ బ్యాక్టీరియాను పేగుల్లోకి పంపించి తిరిగి వృద్ధి చెందేలా చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని డ్యూక్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన బిల్‌ పార్కర్‌ చాలాకాలం కిందటే ప్రతిపాదించారు. దీనిపై విన్‌తోర్ప్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జేమ్స్‌ గ్రెండెల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సి.డిఫ్‌ బ్యాక్టీరియా మూలంగా పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిని ఎంచుకొని పరిశీలించింది. ఆసుపత్రుల్లో దీర్ఘకాలం యాంటీబయోటిక్స్‌ చికిత్స తీసుకుంటున్నవారిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తుంటుంది. పేగుల్లో సహజ బ్యాక్టీరియా బలంగా ఉన్నప్పుడు సి.డిఫ్‌ దాంతో పోరాడలేదు. అయితే సహజ బ్యాక్టీరియా తగిన సంఖ్యలో లేకపోతే అది త్వరత్వరగా వృద్ధి చెంది విజృంభిస్తుంటుంది. గ్రెండెల్‌ బృందం చేసిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన అంశం బయటపడింది. అపెండిక్స్‌ గలవారితో పోలిస్తే.. వివిధ కారణాలతో అపెండిక్స్‌ను తొలగించిన వారిలో సి.డిఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ మళ్లీ రావటం రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. అంటే ఉండుకం మేలుచేసే బ్యాక్టీరియాను తిరిగి వృద్ధి చెందేలా చేస్తూ.. మన ప్రాణాలను కాపాడటంలోనూ తోడ్పడుతుందున్నమాట. అందువల్ల అత్యవసరమైతే తప్ప అనవసర కారణాలతో అపెండిక్స్‌ను తొలగించరాదని.. దాన్ని కాపాడుకోవటం కీలకమనీ ఈ అధ్యయనం రుజువు చేస్తోంది. అపెండిక్సు మంచి బ్యాక్టీరియా కేంద్రం.

నిజానికి ఉండుకం నిర్వర్తించే శారీరక ధర్మాలపైన ఇప్పటికీ మనకు అవగాహన తక్కువే. ఒకప్పుడు ఇదో నిరర్థక అవయవమని భావించేవాళ్లు. కానీ ఇటీవలి పరిశోధనలలో దీనికీ ప్రాధాన్యత ఉందనీ, ముఖ్యంగా దీనిలో ఉండే 'లింఫాయిడ్‌' ధాతువు కారణంగా శరీర రక్షణ వ్యవస్థలో దీనికి పాత్ర ఉందనీ గుర్తించడం జరిగింది.

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment