- అందుబాటులో ఉండే వాటితోనే అందంగా ఎలా కనిపించవచ్చో-
* తాజా మెంతి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే యాక్నె, మొటిమలూ, ముడతలూ, బ్లాక్ హెడ్స్ వంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే
*స్ట్రాబెర్రీలు కొన్నప్పుడు ఆ బాక్స్‌లో అడుగున కొన్ని ఆకులు ఉంటాయి. వాటిని పారేయాల్సిన అవసరం లేదు. మొటిమలు అధికంగా ఉన్నవాళ్లు, ఆ ఆకుల్ని మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే, వాటి చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది.
* రెండు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల రోజ్‌వాటర్‌ని కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ఎండిన తులసి ఆకులతో చేసిన టీలో దూది ముంచి దానితో ముఖాన్ని తుడుచుకొంటే ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు.
* యాక్నె అధికంగా ఉండేవారు అలొవెరా రసాన్ని రెండు పూటలా ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. గంధానికి రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పట్టించి, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
- కలబందతో కళగా..12/08/2014
అరకప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్‌స్పూన్ల మందార పువ్వుల పేస్టును వేసి బాగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఈ పూత జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి పోషణనిస్తుంది.
చర్మం మరీ పొడిగా, తాకితే గరుకుగా అనిపిస్తోందా! అయితే చర్మానికి తేమనందించే ఈ క్యారెట్ మాస్క్‌ని ప్రయత్నించి చూడండి. -- 17-Aug-14
చెంచా తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల క్యారెట్ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది. క్యారెట్ రసం, నిమ్మరసం, సెనగపిండిని సమపాళ్లలో తీసుకొని పావుకప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ కాళ్లూ, చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా ఆలివ్‌నూనె, రెండు చెంచాల క్యారెట్ రసం, కాస్త పెరుగూ తీసుకుని బాగా గిలకొట్టాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు ఛాయలని వెనక్కి నెట్టేస్తాయి. క్యారెట్ తురుమూ, పాలపొడీ, పంచదారని సమపాళ్లలో తీసుకొని ముఖంపై రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగి ముఖం కాంతిమంతం అవుతుంది.
స్నానం ద్వారా చర్మ సమస్యలు మాయం
వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా భాధిస్తాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు. ఈ ఇబ్బందులన్నీ తొలగించుకుని చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.
ఈ కాలంలో పొగలొచ్చే వేణ్నీళ్లతో స్నానం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అలాకాకుండా గోరువెచ్చని నీళ్లలో కొబ్బరినూనె కలిపితే చర్మం మృదువుగా మారుతుంది. కాగుతున్న నీళ్లలో వేపాకు లేదంటే నిమ్మతొక్కలు వేస్తే వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి.
* సబ్బులూ, గాఢత ఎక్కువగా ఉన్న క్రీమ్‌లు వాడకపోవడం మంచిది. వాటివల్ల కొన్నిసార్లు చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. సున్నిపిండీ, నలుగు పిండి వంటి వాటికి ప్రాధాన్యమివ్వడం మంచిది.
* అప్పుడప్పుడూ కాసిని నీళ్లలో లవంగాల నూనె చేర్చి ఒంటికి మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా పాదాలకు మసాజ్ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. అలానే వర్షంలో తడిసి ఇంటికెళ్లినప్పుడు స్నానం చేసే నీళ్లలో వెనిగర్ కలపాలి. దీంతో బురద వల్ల వెంట వచ్చిన ఫంగస్ వదిలిపోతుంది. రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి రాత్రిపడుకునే ముందు ముఖం, మెడా తుడుచుకుంటే కనిపించని క్రిములూ మురికీ దూరమవుతాయి. చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది.
- అందానికి ఆలివ్
* తరచూ మేకప్ వేసుకునే వారి చర్మం త్వరగా పొడి బారుతుంది. ఈ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే మేకప్‌ను తొలగించడానికి ఆలివ్‌నూనెను వాడాలి. దాన్ని గోరువెచ్చగా చేసి ముఖానికి మర్దన చేసి, కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల, కఠిన రసాయనాల ప్రభావం చర్మంపై పడదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
* కొందరికి గోళ్లు ఇట్టే విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
పెసరపిండితో అందం
అందంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తప్పనిసరి. దీనికి అందుబాటులో ఉండే వంటింటి వస్తువులు సరిపోతాయి. అలాంటివాటిల్లో పెసరపిండి కూడా ఒకటి.
చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పు పెసరపిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
రెండుమూడు చెంచాల పెసరపిండీ, పావుకప్పు పెరుగూ, చెంచా తేనె, చిటికెడు పసుపూ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం శుభ్రంగా కడుక్కున్నాక పూతలా వేసి, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలూ, మొటిమల తాలూకు మచ్చల్ని తొలగిస్తుంది.
పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా పెసరపిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జూ, అరచెంచా బొప్పాయి పేస్ట్ కలుపుకొని మెత్తగా చేసుకుని ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తారు.
గుడ్డులోని తెల్లసొనలో చెంచా పెరుగూ, చెంచా పెసరపిండీ, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తగ్గుతుంది.
- పాల మెరుపు
* చర్మం పొడి బారి ఇబ్బందిపెడుతోందా! దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి ఆరనివ్వాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది. పచ్చి పాలల్లో గులాబీ రేకల ముద్దా, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు ఒంటికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
* ఎండవేడితో తలెత్తే టాన్, పిగ్మేంటేషన్ వంటి సమస్యలను పచ్చిపాలు అదుపులో ఉంచుతాయి. మేని ఛాయను మెరుగుపరుస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్ యాసిడ్ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. పచ్చి పాలూ, తేనె మిశ్రమాన్ని రోజూ ఒంటికి రాసుకుని ఆరాక స్నానం చేస్తే సరి. స్నానం చేసే నీళ్లలో అరకప్పు పచ్చిపాలూ, చెంచా గులాబీ నీరూ, రెండు చెంచాల ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవాలి. దీనితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అవసరమైన పోషకాలు అంది నిగనిగలాడుతుంది.
- =========================